మచిలీపట్నం జిల్లా కోర్టులో రామకృష్ణయ్యకు ఘన వీడ్కోలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి. రామకృష్ణయ్య మచిలీపట్నం నుండి కర్నూలుకు బదిలీ అయిన సందర్భంగా మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణా జిల్లా జడ్జి జి. గోపి మాట్లాడుతూ, గత 40 నెలలుగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా రామకృష్ణయ్య విశేష సేవలు అందించి తన పదవికి వన్నె తెచ్చారని అన్నారు. ఆయన హయాంలో కృష్ణా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో, చట్టాలపై అవగాహన కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు.

విజయవాడతో సహా జిల్లాలోని కారాగారాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఖైదీల హక్కుల పరిరక్షణలో రామకృష్ణయ్య ఎనలేని కృషి చేశారని గోపి ప్రశంసించారు. అధికారం అంటే అధికార ప్రదర్శన కాదని, సేవ భావనతో పనిచేయాలని ఆయన తన కార్యచరణ ద్వారా చాటిచెప్పారని అన్నారు.

ఈ సందర్భంగా రామకృష్ణయ్య మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో తన పదవీకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందించిన సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగినట్లు తెలిపారు. న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు.

సీనియర్ న్యాయవాది, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, రామకృష్ణయ్య తన పదవీకాలంలో వేలాది కేసులను పరిష్కరించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. బెంచ్-బార్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి ప్రశంసనీయమని తెలిపారు. అజమాతున్నిస్సా బేగం మాట్లాడుతూ, “విక్టిమ్ కాంపెన్సేషన్ చట్టం” కింద సుమారు రూ.2 కోట్ల పరిహారం బాధితులకు అందజేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి చదలవాడ యుగంధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. సాయి సుధా, మొబైల్ మేజిస్ట్రేట్ జొన్నలపల్లి బాల త్రిపుర సుందరి దేవి, రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. దేవస్థ దీపిక, సంస్థ సూపరింటెండెంట్ చిట్టూరి జయశ్రీ దేవి, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓ.ఎస్.కే. శివకుమార్, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. చివరగా జిల్లా జడ్జి జి. గోపి, న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది కలిసి రామకృష్ణయ్యను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

Leave a Reply