రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

లేకుంటే జూన్ 1న కలెక్టరేట్ల వద్ద రైతుల ధర్నాలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, ఆంధ్రప్రభ : రైతాంగ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రైతాంగానికి పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రణాళిక, విత్తన ప్రణాళిక, రుణ ప్రణాళికలను ప్రకటించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

సాగునీటి విడుదలపై తేదీలు నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల్లో పూడికలు తొలగించలేదని, తూటికాడ, గుర్రపు డెక్క పేరుకుపోయాయని పేర్కొన్నారు. పలు కాలువల గేట్లు తుప్పు పట్టి పనికిరాని స్థితికి చేరుకున్నాయని విమర్శించారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరమ్మతులు లేక మూలనపడ్డాయని, సాగునీటి వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు, కౌలు రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు 90 శాతం రాయితీతో అందించాలని డిమాండ్ చేశారు.

విత్తనాల ధరలను నియంత్రించి నాసిరకం, కల్తీ విత్తనాల విక్రయాన్ని అరికట్టాలని కోరారు. రాయలసీమ ప్రాంతాల్లో వేరుశెనగ సాగు అధికంగా ఉంటుందని, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం రాయితీతో వేరుశెనగ విత్తనాలు అందించాలని సూచించారు.

ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి అవసరమైన పెట్రోల్, డీజిల్‌ను పన్నులు లేకుండా లీటరు రూ.35కే రైతులకు అందించాలని కోరారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, యూరియాను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు అందించాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని కోరారు.

పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, కంపెనీలు నాణ్యత పేరుతో ధరలు తగ్గించి రైతులను నష్టపరుస్తున్నాయని ఆరోపించారు. పొగాకు క్వింటాకు రూ.36 వేల నుంచి రూ.45 వేల వరకు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని, వ్యవసాయ అప్పులతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు అందించే సాయాన్ని రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

రాయలసీమలో వర్షాభావంతో ఎండిపోతున్న చీనీ తోటలకు ఎకరాకు రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 1న కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాల్లో పెద్దఎత్తున రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతులకు ఇప్పటివరకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రొయ్యల మేత ధరలు తగ్గించాలని, రొయ్యలకు మద్దతు ధరలు ప్రకటించాలని కోరారు. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించాలని డిమాండ్ చేశారు.

రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు పూర్తి సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందించాలని కోరారు. మొక్కజొన్న రైతులకు వ్యత్యాస ధరను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply