వాల్మీకి లక్ష్యాలను సాధించాలి
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేస్తే జీవితంలో ఎత్తైన స్థాయికి ఎదగడం సాధ్యమవుతుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్ అన్నారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి మంత్రి ఫరూక్, వాల్మీకి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి “ఆదికవి”గా మానవజాతికి చిరస్మరణీయమైన రామాయణాన్ని రచించారని గుర్తు చేశారు. ఆయన జీవితం, ధర్మబోధనలలో నిగూఢమైన మానవతా విలువలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం కేవలం ఒక ఇతిహాస కథ మాత్రమే కాకుండా, జీవన విధానానికి మార్గనిర్దేశం చేసే సాహిత్య కావ్యమని అన్నారు. నారద మహర్షి సూచనలతో అడవిలో నివసిస్తూ వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించారని, ఆయన రచనలో ప్రతిఫలించిన ధర్మం, నైతికత, సత్యం, న్యాయం వంటి విలువలు సమాజ నిర్మాణానికి పునాది వేశాయని వివరించారు. యువత వాల్మీకి మహర్షి జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని కృషి, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. అంతకుముందు వాల్మీకి సంఘాల నాయకులు గోవింద నాయుడు, బోయ రామకృష్ణ, కాశన్న, వెంకటేశ్వర్లు, గుర్రప్ప, లాలు తదితరులు వాల్మీకి మహర్షి సమాజానికి అందించిన సేవలపై ప్రసంగించి ఆయన బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కోరారు.

