చొక్కళ్ల ఇంట ‘బంగారు’ వెలుగు

చొక్కళ్ల ఇంట ‘బంగారు’ వెలుగు
- వైద్య విద్యలో మెరిసిన నేరడ ఆడబిడ్డ
చిట్యాల, ఆంధ్రప్రభ : “ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి.. ఆ ఇంటి వెలుగు” అన్న పెద్దల మాటను అక్షరాలా నిజం చేసింది ఆ యువతి. కేవలం ఒక కుటుంబానికే కాదు, పుట్టిన ఊరికి, పెరిగిన జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన చొక్కళ్ల భ్రమర, వైద్య విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
తాతయ్య ఆశయం.. మనవరాలి విజయం

నేరెడ గ్రామ మాజీ సర్పంచ్ చొక్కళ్ల మయాచారి – లక్ష్మమ్మ దంపతుల మనవరాలైన భ్రమర, చిన్ననాటి నుంచే చదువులో మేటి. ఆడబిడ్డలు ఆధునిక విద్యలో రాణించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తపించే తన తాతామామ్మల కలలను భ్రమర నిజం చేసింది. సోమవారం వికారాబాద్‌లోని మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాన్వొకేషన్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఆమె గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ వేడుకలో తన కుమార్తె విజయాన్ని చూసి తల్లిదండ్రులు వెంకటాచారి – ఇందిరమ్మలు ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రస్థానం: అన్నీ టాపర్ మార్కులే!
భ్రమర విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు. ఆమె విద్యా ప్రస్థానమంతా అగ్రస్థానమే. పదో తరగతిలో నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఇంటర్మీడియట్‌లో హైదరాబాద్ చైతన్య కాలేజీలో అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారు. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆమెది అందెవేసిన చేయి. అందుకే కుటుంబ సభ్యులు ఆమెను ‘మల్టీ టాలెంటెడ్’ డాక్టర్ అని గర్వంగా పిలుచుకుంటారు.
“మాతృభూమి సేవలోనే పరమార్థం”
“చాలామందిలా విదేశాలకు వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు. నా చదువు, నా సేవలు నా దేశానికే అంకితం. ఇక్కడే పీజీ పూర్తి చేసి, సామాన్యులకు వైద్యం అందిస్తాను. అదే మా తాతయ్య, తల్లిదండ్రుల ఆశయం.”
డాక్టర్ చొక్కళ్ల భ్రమర
గ్రామంలో పండగ వాతావరణం తమ గ్రామ బిడ్డ డాక్టరుగా పట్టా అందుకోవడమే కాకుండా, బంగారు పతకంతో మెరిసిపోవడంతో నేరడ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సాంప్రదాయ విలువలను గౌరవిస్తూనే, ఆధునిక విద్యలో రాణించవచ్చని భ్రమర నిరూపించిందని గ్రామస్తులు కొనియాడుతున్నారు.
