Kammarpalle | రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Kammarpalle | రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి
Kammarpalle | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పక పాటించాలని కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఏనుగంధుల శైలెందర్ ఆద్వర్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరితో రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ట్రాఫిక్ నియమాలు,హెల్మెట్ తప్పనిసరి వాడకం, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

అదే ప్రాంతానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకొని, ప్రమాదాల తీవ్రతను ప్రజలకు వివరించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చో తెలియజేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ (బి ఎల్ ఎస్ ) పద్ధతులపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలందరినీ రోడ్డు భద్రత బాధ్యతల్లో భాగస్వాములను చేసి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.
అనంతరం గ్రామ సర్పంచ్ ఏనుగంధుల శైలేందర్, ఉప సర్పంచ్ ముత్యంలు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సుంకరి విజయ్ కుమార్ కూడా హాజరై,అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన చర్యలపై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలక వర్గం, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
