Sankranthi celebrations | ముగ్గుకు రంగద్దిన మల్లన్న..

Sankranthi celebrations | ముగ్గుకు రంగద్దిన మల్లన్న..
- సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు
- బీఆర్ఎస్ నాయకులు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ
- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మల్లారెడ్డి
Sankranthi celebrations | మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భాగంగా మేడ్చల్ సర్కిల్ కేఎల్ఆర్ వెంచర్‌లో ఈరోజు మాజీ కోఆప్షన్ మెంబర్, బీఆర్ఎస్ నాయకులు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు తన శైలిలో సవాల్ విసిరారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పాలకులు రాజకీయ లాభాలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలు నిత్యం విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడి తదితర కనీస వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు సమస్యల మధ్య జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన బదులు మరింత దిగజారుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మల్లారెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందన్నారు.
మల్లారెడ్డి విద్యాసంస్థల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం, భోజన వసతి, నాణ్యమైన ఉన్నత విద్య అందిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, నా ప్రజాసేవే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళామణులకు నగదు బహుమతులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
