TG | ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ

ఎర్రవల్లి : ఫాంహౌస్‌లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఇద్దరూ విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

కమిషన్ నోటీసుల నేపథ్యంలో వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీశ్ రావు విచారణకు హాజరుకానున్నారు. ఈ విచారణల్లో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్లు తెలిసింది.ఇప్పటికే న్యాయనిపుణులను సంప్రదించిన కేసీఆర్, హరీశ్ రావు.. చట్టపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. అలాగే, గతంలో కమిషన్ ముందు హాజరైన అధికారులు, ఇంజినీర్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. కమిషన్‌ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యంతో పాటు తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు వంటి అంశాలను కమిషన్‌కు వివరించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply