Temple | నేత్రపర్వం.. గిరి ప్రదక్షిణ

Temple | నేత్రపర్వం.. గిరి ప్రదక్షిణ
- ఇంద్రకీలాద్రి గిరిపై నగర వీధుల్లో విహరించిన దుర్గామల్లేశ్వర స్వామివార్లు
Temple | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : జై భవానీ.. జై జై దుర్గా భవానీ నామస్మరణ.. డప్పు వాయిద్యాలు.. కోలాటం.. మంగళ వాయిద్యాల నడుమ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత, మల్లేశ్వరుడు సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు తెలిపారు. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంప్రదాయ కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, డప్పుల వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగుతుంది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్త పేట ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండి.. శ్రీ దుర్గామల్లేశ్వరుల రథం నడిచే దారిలో పసుపు నీళ్లతో శుభ్రం చేసి, దేవ దేవేరిలకు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.

