Thieves | చోరీల కలకలం.. ప్రజల ఆగ్రహం..

Thieves | చోరీల కలకలం.. ప్రజల ఆగ్రహం..
Thieves | నకరికల్లు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన నకరికల్లులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసుల నిర్లక్ష్యం దొంగలకు వరంగా మారిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు గ్రామానికి వచ్చి రోజు గడవకు ముందే వరుస దొంగతనాలు జరగడం పోలీసు యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు స్థానిక పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీకి సందర్శించిన రోజు రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. జీడీసీసీ బ్యాంక్ బజార్, కొట్ల బజార్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన పది ద్విచక్రావాహనాల నుండి పెట్రోలు చోరీ చేశారు. పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ ఇంతటి సాహసానికి పాల్పడటం స్థానికులను విస్మయానికి గురి చేసింది. అదే విధంగా, జిల్లా ఎస్పీ కృష్ణారావు శనివారం ఆకస్మిక తనిఖీ నిమిత్తం గ్రామానికి వచ్చిన రాత్రి కూడా దొంగలు తమ ప్రతాపాన్ని చూపారు. బాల్రెడ్డి మిల్లు సమీపంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉన్నతాధికారుల రాకతో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలోనే ఈ ఘటనలు జరగడం గమనార్హం.
- ఉత్సవ విగ్రహాలుగా సీసీ కెమెరాలు..
నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గ్రామంలో అలంకారప్రాయంగా మారాయి. దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. అవి పని చేయడం లేదని తేలింది. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ నిర్వహణలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాలతో భయాందోళనలో ఉన్న గ్రామస్తులు పోలీసుల తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పని చేయని సీసీ కెమెరాలను మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని.. రాత్రి సమయాల్లో పోలీసు గస్తీని పెంచి ఆస్తులకు రక్షణ కల్పించాలిని.. చోరీలకు పాల్పడిన నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి గ్రామస్థులకు భరోసా కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో స్థానిక ఎస్సై సతీష్ ని వివరణ కోరగా.. “గ్రామంలో ప్రస్తుతం పని చేయని సీసీ కెమెరాలను గుర్తించామని, వాటికి తక్షణమే రిపేర్లు చేయిస్తున్నామని తెలిపారు. చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలకు భద్రత కల్పించేందుకు గ్రామంలో పోలీసు గస్తీ (పెట్రోలింగ్) పెంచుతామని” వెల్లడించారు.
