గోదాం దగ్ధం.. లక్ష నష్టం

మంత్రాలయం, ఆంధ్రప్రభ :తుంగభద్ర నది తీరంలో హోటల్ వ్యాపారం చేస్తున్న జంగం రంగస్వామికి చెందిన గోదాం అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి బూడిదైంది. హోటల్‌కు అవసరమైన సామాగ్రిని భద్రపరిచేందుకు రంగస్వామి నది తీరం పక్కనే ఉన్న ఒక గోదామును అద్దెకు తీసుకున్నారు. ఆ గోదాములో ఫ్రిజ్, గ్రైండర్, వంట సామాగ్రితో పాటు నిత్యావసర కిరాణా వస్తువులను నిల్వ చేశారు. బుధవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే మొత్తం గోదాం అగ్నికి ఆహుతైంది. లోపల ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, సరుకులు అన్నీ కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ.1 లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు రంగస్వామి తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎమ్మిగనూరు నుంచి ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను కష్టపడి అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గోదాంలోని సామాగ్రి మొత్తం దగ్ధం కావడంతో వ్యాపారికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.