Congress | కాంగ్రెస్ నాయకులది అర్బాటమే

Congress | కాంగ్రెస్ నాయకులది అర్బాటమే

  • చేసింది ఏమి లేదు
  • బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే మల్లి జీవోలు

Congress | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో భీంగల్ పట్టణానికి చేసిందేమీ లేదని, రెండేండ్లలో తట్టేడు మన్ను కూడా పోయలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోదిరే నర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల భగత్ విమర్శించారు. ఇవాళ‌ భీంగల్ పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2013 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తరువాత 8 ఆగస్ట్ 2023న పట్టణంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్లతో జీవో ను అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విడుదల చేయించారని పేర్కొన్నారు. ఆ జీవో ద్వారా పట్టణంలోని వివిధ వార్డ్ ల్లో అభివృద్ధి పనులను గుర్తించడం, గుర్తించిన పనులకు టెండర్లు వేయడం జరిగిందని తెలిపారు. తీరా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత టెండర్లు అయిన పనులను అగ్రిమెంట్ కాకుండా నిలిపి వేయడం జరిగిందని పేర్కొన్నారు.

టెండర్ అయిన పనులను కాకుండా చేయడం ద్వారా అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పేరు రాకుండా చేయడంలో కాంగ్రెస్ నాయకులు విజయం సాధించారని విమర్శించారు. తీరా మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో అప్పుడు అగ్రిమెంట్ కాకుండా అడ్డుకున్న పనులకు తిరిగి అగ్రిమెంట్ చేసి పట్టణం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్టు డ్రామాకు తెరలేపడం జరిగిందని విమర్శించారు. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ 2.0 స్కీం ద్వారా పట్టణంలో నీటి ఏద్దది నివారణకు కాలేజీ వెనుక 11లక్షల కెపాసిటీ నీటి ట్యాంకు, నర్సరీ లో ఐదు లక్షల నిలువ గల నీటి ట్యాంకులు నిర్మించి అందులోకి పైప్ లైన్ ద్వారా నీటిని నింపి సరఫరా చేసేందుకు పైప్ లైన్ నిర్మాణం కోసం ఆర్గుల్ సంప్ నుండి ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం కోసం అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రూ.25 కోట్లు మంజూరు చేయించడం, టెండర్ ప్రక్రియ పూర్తయిన సంగతి గుర్తు చేశారు. ఆ పనులను కూడ కొత్తగా మంజూరు చేసినట్టు చెప్పుకుంటూ శంకుస్థాపన చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన పనులకు పేర్లు మార్చి తిరిగి శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజల్లో ప్రశాంత్ రెడ్డి పై ఉన్న అభిమానం తుడిచి వేయలేరన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన పనులకు కాకుండా అదనపు నిధులు సాధించి పట్టణం అభివృద్ధి కోసం పాటు పడాలని సవాల్ విసిరారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన రూ.10కోట్ల అభివృద్ధి పనులతో పాటు రూ.25 కోట్ల అభివృద్ధి పనుల్లో మిగిలిన కోటి 50 లక్షల కళ్యాణ మండపం నిధులు మొత్తం 11.50 కోట్లతో పనులు చేస్తున్నామని, తిరిగి శంకుస్థాపన చేయించడం సిగ్గుచేటని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయించిన పనులను తిరిగి మంజూరు చేయించినట్టు చెప్పుకోవడం ప్రజలు గమనించాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. జీవో లు మార్చినంత మాత్రాన ప్రజల్లో ప్రశాంత్ రెడ్డి పై ఉన్న అభిమానం ఎటు పోదని, అభివృద్ధి చేసింది ఎవరో అడ్డుకుంటుంది ఎవరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశం లో బీఆర్ఎస్ నాయకులు సతీష్ గౌడ్, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి, రాజు నాయక్, పతాని లింబాద్రి, నల్లూరి లింబాద్రి, ఇక్రమ్, రతన్ రాజ్, అశోక్, రామకృష్ణ, చరణ్, సాదు, సునిల్, సాగర్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply