Atal Bihari Vajpayee | జీవితం స్ఫూర్తిదాయకం..

Atal Bihari Vajpayee | జీవితం స్ఫూర్తిదాయకం..

Atal Bihari Vajpayee, శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : నవ భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సుపరిపాలన వారసత్వం నేటి తరానికి నిత్య స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దేశభక్తి, ప్రజాసేవ, రాజకీయ నైతికతకు అటల్ జీ ప్రతీకగా నిలిచారని వారు కొనియాడారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం కదిరి పట్టణంలోని బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ కూడలిలో బీజేపీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయికి దీప వెలుగులతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. అటల్ జీ నాయకత్వంలో దేశం మౌలిక వసతుల అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. స్వర్ణ చతుర్భుజ రహదారి ప్రాజెక్టు, గ్రామీణ రహదారులు, సమాచార సాంకేతిక విప్లవానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. విభిన్న రాజకీయ భావజాలాల మధ్య సమన్వయం సాధించిన గొప్ప రాజనీతిజ్ఞుడిగా అటల్ జీ చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. అలాగే, కవిగా, వక్తగా, మానవతావాదిగా అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా పెంచడంలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అటల్ జీ ఆశయాలను కొనసాగించాలని సంకల్పం చేశారు.

Leave a Reply