MLC FIRE : ప్చ్.. అసలు బాగోలేదు

- ఇవి గుడ్లు.. ఇవి పాలు
- నాసిరకం పెడ్తారా
- ఇంత నిర్లక్ష్యం సహించం
- పులివెందుల బాలికల హాస్టల్లో..
- వసతులపై ఎమ్మెల్సీ అసహనం, ఆగ్రహం
( పులివెందుల , ఆంధ్రప్రభ) : పులివెందుల పట్టణం, బాకరపురం సమీపంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతి గృహంను శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగావిద్యార్థుల వసతులు, భోజన నాణ్యత, నిర్వహణ వ్యవస్థను నిశితంగా పరిశీలించారు. ఇక్కడ నెలకొన్న సమస్యలపై, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనిఖీ సందర్భంగా విద్యార్థులకు పెట్టె కోడిగుడ్లను గమనించిన ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లల ఆరోగ్యంపై ఇలాంటి నిర్లక్ష్యం సహించలేం అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పాలలో నాణ్యత లోపం ఉన్నట్టు నిర్ధారించారు. ఆయన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వసతి గృహంలోని మౌలిక సదుపాయాల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గదుల పరిశుభ్రత, మంచినీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారంపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు తమ బాధ్యతలను నిర్లక్ష్యంగా నిర్వర్తించడం తీవ్రంగా ఖండించిన ఆయన, ఇటువంటి నిర్లక్ష్యం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఇతర హాస్టళ్లను కూడా తనిఖీ చేస్తామని, ఎక్కడైనా అవినీతి, నిర్లక్ష్యం చోటుచేసుకున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.విద్యార్థుల సంక్షేమం ప్రథమ ప్రాధాన్యత అని, ముఖ్యమంత్రి కి దీనిపై స్పష్టమైన దృష్టి, పటిష్ట సంకల్పం ఉన్నాయని, కూటమీ ప్రభుత్వం సంక్షేమ రంగం బలోపేతానికి పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను భోజనం ఎలా ఉందని, మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
