Collectorate | ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు…

Collectorate | ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు…
Collectorate | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా, పూర్తిగా శాంతియుత వాతావరణంలో సజావుగా జరగేందుకు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ. సీతాలక్ష్మి(A. Seethalakshmi) అధికారులకు సూచించారు.
ఈ రోజు నారాయణపేట జిల్లా కలెక్టరేట్(Collectorate)కు వచ్చిన ఆమెకు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్(Sanchit Gangwar) పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్(Media Center), కంట్రోల్ రూమ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత పరిశీలకురాలు కొత్తపల్లి మండలం నిడ్జింత, మద్దూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల నామినేషన్ కేంద్రాలను సందర్శించారు.
నామినేషన్ల స్వీకరణ(reception of nominations) ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అని సూచించారు. అభ్యర్థులు సమర్పించాల్సిన అవసరమైన ధ్రువపత్రాల వివరాలను స్పష్టంగా వారికి తెలియజేయాలని, ఫారాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకునేలా పూర్తి సహకారం అందించాలి అని తెలిపారు.
ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం ప్రతి అధికారి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శెట్టి వెంకటేష్, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
