SAND | వినియోగదారులకు సమృద్ధిగా ఇసుక

SAND | వినియోగదారులకు సమృద్ధిగా ఇసుక

SAND | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో ఇసుక కొరత రాకుండా వినియోగదారులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉచిత ఇసుక (sand) విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతంతో పాటు రానున్న కాలంలో జిల్లాలో నిర్మాణ అవసరాలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకు అన్ని ఇసుక స్టాక్ యార్డులలో సమృద్ధిగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనుమతుల మేరకు జిల్లాలో సెమీ మెకనైజ్డ్ విధానంలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టాలని సూచిస్తూ, కృష్ణా నదికి (Krishna River) వరదలు తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా మరో నాలుగు ఇసుక రీచ్ లను గుర్తించి టెండర్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఇసుక నిల్వలపై కలెక్టర్ ఆరా తీయగా, ఉన్న ఇసుక రీచ్ లలో దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉందని గనుల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సత్యనారాయణ, బందరు ఆర్డీవో కే స్వాతి, గనుల శాఖ ఏడి శ్రీనివాసరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ కొండారెడ్డి, ఇరిగేషన్ శాఖ కేసి డివిజన్ ఈఈ రవి కిరణ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply