Mahbubnagar | వరి రైతులకు సంచులు ఇవ్వాలి

Mahbubnagar | వరి రైతులకు సంచులు ఇవ్వాలి
- కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు చెక్ పెట్టాలి
Mahbubnagar | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వరి కొనుగోలు కేంద్రాల్లో అవకతకాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులకు నేరుగా ఖాళీ వడ్ల సంచులు అందించాలని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ ఏ. ఓ. శ్రీధర్(District Collector A. O. Sridhar)కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు కల్లాల దగ్గరికి తీసుకెళ్లడానికి కావాల్సిన ఖాళీ సంచులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని, దీంతో రైతులు అదనపు రవాణా ఛార్జీలు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల భారం తగ్గించడానికి కల్లాల వద్ద నుంచే కేంద్రాల వరకు ధాన్యాన్ని తీసుకురావడానికి అవసరమైన ఖాళీ సంచులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో కొన్ని సందర్భాలలో రైస్‌మిల్లర్లు(Rice Millers), కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ‘తరుగు, తాలు’ పేరుతో అధిక కాటాలు వేసి రైతులను నష్టపరిచిన విషయాలను గుర్తు చేశారు.
ఇలాంటి దోపిడీ చర్యలు పునరావృతం కాకుండా కొనుగోలు కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ చేపట్టాలని, రైస్‌మిల్లుల్లో వినియోగిస్తున్న కాటాలు సరిచూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, దస్తప్ప, మల్లేష్, హన్మంతు, బింపూర్ హన్మంతు, నరహరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
