Shilpa | పీపీపీ విధానం వద్దు…
ప్రైవేటీకరణపై వైసిపి ఆందోళన ఉద్యమం…
కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి (Shilpa Ravichandra Kishore Reddy), ఎమ్మెల్సీ ఇసాక్ బాషాలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు.
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా (Isaac Basha), మాజీ జడ్పీ చైర్మన్ పి పి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జులు, సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య నేతల ఆధ్వర్యంలో, వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. వారు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా ఏకంగా 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారన్నారు. ఈ కళాశాలల్లో 750 మెడికల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో నంద్యాల ఉండటం, అందులో చదివిన ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణమన్నారు.

నంద్యాల మెడికల్ కళాశాల (Nandyal Medical College) కు 16పీజీ సీట్లు కేటాయించారన్నారు. అలాగే 11 డిస్టింక్షన్ లు సాధించారన్నారు. పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్ష గట్టారని విమర్శించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు. రూ.2లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తానని ప్రగల్బాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణాలకు 5వేల కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు, వారి వ్యాపార ప్రయోజనాల కోసం పీపీపీ విధానం తీసుకురావడం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

