జై శ్రీరామ్ ఇటుకలు..
జై శ్రీరామ్ ఇటుకలు..
భద్రాచలం, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్యాత్మిక భావనతో నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. భద్రాచలం శ్రీ సీతారామ దేవస్థానంలో జై శ్రీరామ్ అచ్చు ఉన్న ఇటుకలను తయారు చేయడానికి అవసరమైన ప్రత్యేక మోల్డ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా బెంగళూరులో తయారు చేయించి దేవస్థానానికి అందించారు. భక్తులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని, భక్తి భావంతో జై శ్రీరామ్ అచ్చు ఉన్న ఇటుకల తయారీలో పాల్గొనాలని సూచించారు.
రామ భక్తులు, ఆధ్యాత్మిక భావన ఉన్నవారు తమ ఇంటి నిర్మాణంలో జైశ్రీరామ్ అని అచ్చు ఉన్న ఇటుకలను వాడవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవస్థానం ఈవోతో పాటు ఆలయ సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. కలెక్టర్ చేసిన ఈ ఆలోచన పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
