శ్రీశైలంలో హోటల్ భవనానికి శంకుస్థాపన..

శ్రీశైలంలో హోటల్ భవనానికి శంకుస్థాపన..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ సంస్థ నిర్మించనున్న 4 స్టార్ హోటల్‌ భవనానికి ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడు నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంగళవారం వర్చువల్‌గా పూజచేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఆధునిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ 4 స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోనే తిరుపతి (Tirupati) తరహాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని పర్యాటక రంగంగా మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు భక్తుల కోసం నాలుగు స్టార్ల హోటల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ పి.రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసులు, శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ వ్యవస్థాపకులు రామస్వామి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.


నంద్యాల జిల్లా (Nandyal District) ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో పరిశ్రమలు ఉపాధి కల్పనలో భాగంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఎం ఎస్ ఈ పార్కులను ఏర్పాటు చేశారు.కనిగిరిలోని పెదఈర్లపాడు నుండి వర్చువల్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆర్. కృష్ణాపురం గ్రామంలో 44 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్న ఎంఎస్ఎంఈ పార్కులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో పరిశ్రమల జిల్లా మేనేజర్ ఎస్. మహబూబ్ బాషా, హౌసింగ్ ఈఈ శ్రీహరి గోపాల్, స్థానిక తహసిల్దార్, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply