ముంపు ప్రాంతాల సీపీ పరిశీలన

ముంపు ప్రాంతాల సీపీ పరిశీలన
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ముంపు ప్రాంతాల ప్రజలకు ఓరుగల్లు పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. వరంగల్ (Warangal) పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పోలీసుల పరంగా అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామంటూ భరోసా కల్పించారు. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు తలెత్తిన పోలీసులకు సమాచార మివ్వాలని కోరారు. తక్షణమే వరంగల్ పోలీసులు స్పందించి తగిన సహాయమందిస్తారంటూ భరోసా నిచ్చారు. ‘ మేమున్నాం… అధైర్య పడొద్దు….ధైర్యం ‘ గా ఉండాలంటూ ముంపు ప్రాంత ప్రజల్లో ధైర్యాన్ని నింపారు.

ఇళ్లలోకి వరద నీరు వస్తే తక్షణమే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Police Commissioner Sunpreet Singh) అభయ మిచ్చారు. వరద ప్రభావం తగ్గే వరకు ఇళ్ల నుండి బయటకు వచ్చి చిక్కుల్లో పడొద్దని హితువు చెప్పారు. హనుమకొండ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు పరిశీలించారు.

గృహ నిర్బంధమైన ఇళ్లకే పరిమితమైన కాలనీల్లో పోలీస్ కమిషనర్ పర్యటించారు. ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తూ ఉండాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కోరారు.

