Uttam kumar reddy | తెలంగాణ బియ్యానికి ప్రపంచ గుర్తింపే లక్ష్యం
Uttam kumar reddy | తెలంగాణ బియ్యానికి ప్రపంచ గుర్తింపే లక్ష్యం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేసీపీ న్యూట్రీ మల్టీవిటమిన్ రైస్ ఉత్పత్తుల ప్రారంభం
ఫోర్టిఫైడ్ బియ్యంతో రైతులు, రైస్ మిల్లర్లకు అధిక లాభాలు తీసుకురానున్నామని వెల్లడి
Uttam kumar reddy | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణను ప్రపంచ బియ్యం ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం ఉత్పత్తిలో రాష్ట్రం ఇప్పటికే మిగులు రాష్ట్రంగా నిలిచిందని, విలువ ఆధారిత బియ్యం ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని అన్నారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీవిటమిన్ రైస్ ఉత్పత్తులను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచ బియ్యం ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోందని, దీంతో తెలంగాణ మిగులు బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సామర్థ్యాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
ఫోర్టిఫైడ్ (పోషక విలువలు పెంచిన) బియ్యం ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడం ద్వారా రైతులకు, రైస్ మిల్లర్లకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ బియ్యానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ఉత్పత్తులు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ బియ్యాన్ని ప్రపంచ మార్కెట్లో మరింత పోటీ సామర్థ్యం కలిగిన ఉత్పత్తిగా నిలబెడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
