బాలాజీ నాయక్ బాధితుడి ఆత్మహత్యాయత్నం

బాలాజీ నాయక్ బాధితుడి ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : అధిక వడ్డీ ఆశ చూపి పేదల నుండి కోట్లాది రూపాయలను వసూలు చేసిన బాలాజీ నాయక్ ( Balaji Naik) తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు రామావత్ సరియా నాయక్ (37) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన తండా వాసులు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు.
నల్లగొండ జిల్లా (Nalgonda district) పెద్ద అడిశర్లపల్లి మండలం పలుగు తండాకు చెందిన రమావత్ బాలాజీ నాయక్ అనే యువకుడు నూటికి పది రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని నమ్మించి డబ్బులు డిపాజిట్‌గా తీసుకున్నారు. ఇలా ఎందరి నుంచో కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సరియ నాయక్ అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. తండాలో ఇతనికి కేవలం ఐదు గంటల భూమి మాత్రమే ఉన్నట్లు స్థానికులు చెప్పారు. తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా బాలాజీ నాయక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆందోళనకు గురై పురుగుల మందు తాగి రామావత్ సరియా నాయక్ (37) ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు.
అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు తెలిసింది. దీంతో కోపోద్రిక్తులైన తండావాసులు పలుగుతండాలోని బాలాజీ నాయక్ విలాసవంతమైన భవనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ ను ఇంటి ముందు వేసి తగలబెట్టారు. ఇంట్లోని విలువైన వస్తువులు టీవీ, కిటికీలు డోర్లు పగలగొట్టారు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాలాజీ నాయక్ (Balaji Naik) బాధితుల్లో కలవరం రేపింది. నాలుగు నెలల క్రితమే బాలాజీ నాయక్, అతని ఏజెంట్లను శరత్ చంద్ర పవార్ అదుపులోకి తీసుకొని బాధితుల డబ్బులు తిరిగి ఇవ్వాలని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేశారు.
