పూర్తి వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాబోయే సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం, ఫిబ్రవరి 24న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని, పరిస్థితుల ఆధారంగా మార్పులు చేసే అవకాశం ఉందని కూడా తెలిపింది.

నెల ముందుగానే పరీక్షలు

ఇంతవరకు మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఈసారి ఫిబ్రవరిలోనే చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఏప్రిల్‌లో కొత్త తరగతులను ప్రారంభించే వీలుంటుందని బోర్డు పేర్కొంది. ఈ మేరకు పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా సైన్స్ గ్రూప్ విద్యార్థులకు మొదటగా ప్రధాన సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయి. ఇకపై రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్ష మాత్రమే ఉంటుంది.

ఎంబైపీసీ గ్రూప్ ప్రవేశపెట్టడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం కూడా చదివే వీలు కలిగింది. అందువల్ల ఒకే రోజు రెండు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించకుండా, ప్రతి రోజూ ఒకే పరీక్ష ఉండేలా నిర్ణయించారు. సైన్స్ సబ్జెక్టులు పూర్తయ్యాక భాషా పరీక్షలు, ఆపై ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు జరగనున్నాయి.