Tension | తిరుపతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత – కూట‌మి – వైసిపి నేత‌ల మధ్య మాటలు యుధ్దం

తిరుప‌తిలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి.. గోవుల మ‌ర‌ణంపై ఇటు వైసిపి, ఇటు కూట‌మి నేత‌లు మ‌ధ్య మాట‌లు యుద్దాలు, స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో హీట్ ఎక్కిస్తున్నారు.. ఇక తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్‌ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. తిరుపతి ఎస్వీ గోశాలకు రావాలని, అవసరమైన భద్రత కల్పిస్తామని భూమన కరుణాకర్‌ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి‌ ఫోన్లో చెప్పారు. ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ భద్రత ఎర్పాటు చేస్తామని సుధీర్ చెప్పగా.. పోలీసులు అనుమతి ఇస్తే వస్తానంటూ భూమన సమాధానం ఇచ్చారు.

గోశాల‌కు ఎంపి గురుమూర్తి….

కాగా,వైసిపి ఎంపి గురుమూర్తి తిరుప‌తిలోని గోశాల‌కు వ‌చ్చారు.. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉన్న టిడిపి,కూట‌మి నేత‌లు ఆయ‌న‌ను అడ్డుకున్నారు.. భూమ‌న‌ను ర‌మ్మంటే మీరు ఎందుకు వ‌చ్చారంటూ నిల‌దీశారు. ఛాలెంజ్ చేసిన వ్య‌క్తి ఇక్క‌డ రాకుండా అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ టిడిపి నేత‌లు మండిప‌డ్డారు.. భూమ‌న వ‌స్తే తామే స్వ‌యంగా గోశాల‌ను చూపుతామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా గురుమూర్తిని టిడిపి నేత‌లు గోశాల‌కు తీసుకెళ్లి అక్క‌డ గోవుల‌ను చూపారు..

గోశాల‌ను కాదు గో స్మ‌శాన వాటిక‌కు వెళ‌దాం…భూమున

గోశాల‌కు వ‌చ్చి అక్క‌డ గోవుల‌ను ప‌రిశీలిస్తాన‌ని అన్న టిటిడి మాజీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆక‌స్మికంగా యు ట‌ర్న్న‌తీసుకున్నారు.. గోశాల‌కు వ‌స్తే ఆరోగ్యం వంతంగా ఉన్న గోవులే క‌నిపిస్తాయ‌ని అన్నారు.. అలా కాకుండా చ‌నిపోయిన గోవుల‌ను పాత‌పెట్టిన స్మ‌శాన వాటిక‌ను ప‌రిశీలించి అక్క‌డ తవ్వితే ఎన్ని గోవులు మ‌ర‌ణించాయే లెక్క‌లు తేలుతాయ‌ని అన్నారు. త‌న నివాసం వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, త‌న‌ను గోశాల‌కు వెళ్ల‌కుండా రాత్రి నుంచి గృహ‌నిర్భంధంలో పోలీసులు ఉంచార‌న్నారు.. తాను స్వీక‌రించిన ఛాలెంజ్ కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని , అయితే పోలీసులే త‌న‌ను అక్క‌డ‌కు వెళ్ల‌కుండా అడ్డుకుంటున్నార‌న్నారు.

అస‌లు వివాదం..

తిరుప‌తి గోశాల‌లో గోవుల‌కు స‌రైన సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డంతో వంద‌లాది గోవులు చ‌నిపోతున్నాయంటూ భూమున బ‌హిరంగంగానే ఆరోపించారు. దీనిపై స్పందించిన టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు, భాను ప్రకాష్ రెడ్డిలు స్వ‌యంగా వ‌చ్చి గోశాల‌ను చూడాల‌ని ఆహ్వానించారు.. దీనికి భూమ‌న నేడు గోశాల‌కు వ‌స్తాన‌ని, అక్క‌డే అన్ని లెక్క‌లు తేలుస్తాన‌ని బ‌దులిచ్చారు..

ర్యాలీగా గోశాల‌కు వెళ్లకుండా అడ్డ‌గింపు – ఇంటి వ‌ద్దే భూమ‌న బైఠాయింపు

ఈ నేప‌థ్యంలోనే తిరుప‌తిలో స‌వాళ్లే. ప్రతి సవాళ్లతో తిరుపతి లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలతో శాంతి ర్యాలీ నిర్వహించి కరుణాకర్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. కాగా, టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద నేటి ఉద‌యం నుంచి ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసిపి కార్యకర్తలతో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసిపి కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భూమ‌న ప‌రిమిత సంఖ్య‌లో నేత‌ల‌తో గోశాల‌కు వెళితే అనుమ‌తిస్తామ‌ని పోలీసులు తేల్చి చెప్పారు.. మూకుమ్మ‌డి ర్యాలీల‌ను అనుమ‌తి లేద‌న్నారు.. దీంతో భూమ‌న త‌న అనుచ‌రుల‌తో త‌న ఇంటి వ‌ద్దే నిర‌స‌న‌కి దిగారు.. అక్క‌డే నేల‌పై త‌న అనుచ‌రుల‌తో ప‌డుకున్నారు. ఇదే స‌మ‌యంలో కూట‌మి నేత‌లు గోశాల‌ను నేడు సంద‌ర్శించారు… వైసిపి నేత‌లు ఇక్క‌డ కు వ‌చ్చి ప‌రిస్థితులు ప‌రిశీలించాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఆంక్ష‌లు లేవు… ఎవ‌రైన గోశాల‌కు రావ‌చ్చు.

ఇక‌ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ నేడు ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.

శాంతి ర్యాలీ పేరుతో వందలాది కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో‌ గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడవచ్చని కూటమి ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ‘టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేయలేదు. ఎస్వీ గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. రెండు పార్టీల నేతలు ఒకే సారి వెళ్లకూడదని సూచించాం. భూమన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో వెళ్లవచ్చని సూచించాం’ అని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒకే సమయంలో అధికార, ప్రతిపక్షాలు గోశాల సందర్శనకు వద్దని ఎస్పీ హర్షవర్దన్ రాజు సూచించారు. ఎవరినీ గృహ నిర్భందం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చునని ఆయన అన్నారు.

Leave a Reply