జైలుకెళ్లొచ్చినా మారని బుద్ధి

జైలుకెళ్లొచ్చినా మారని బుద్ధి
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో జాతీయ రహదారిపై దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గత నెల 29న సంగారెడ్డి జిల్లాలో హైవేపై మూడు వరుస దాడి దోపిడీలు జరిగాయి. ఇందులో కత్తి గాయాలకు గురై ఓ లారీ డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు(police arrested) చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు.
హైదరాబాద్లోని ఎర్రగడ్డ, మల్కాజిగిరి(Malkajigiri) ప్రాంతాలకు చెందిన తిల్ పిత్యా విజయ్ సింగ్ (20), ఈశ్వర్ సింగ్ (21) మరో మైనర్ బాలుడు ముగ్గురు ఓ వెల్డింగ్ షాప్‌లో పనిచేసేవారు. అయితే గతంలో మాదాపూర్ పోలీస్(Madapur police) పరిధిలో ఒక హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. జల్సాలకు డబ్బులు సరిపోక హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న హైవే రోడ్ల పక్కన నిర్మానుష్య ప్రదేశాలలో ఏదైనా దోపిడీ, దొంగతనాలు చేసి, సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ముగ్గురు నిందితులు కలిసి ఒకే బైక్ పై సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వస్తూ 29న రాత్రి 12:30 గంటల ప్రాంతంలో పఠాన్‌చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బ్రిడ్జి కింద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీల వద్దకు వెళ్ళి డ్రైవరు, క్లీనర్ లను కత్తితో బెదిరించి రూ. 25 వేలు, ఒక సెల్ ఫోన్(cell phone)ను లాక్కొని వెళ్ళిపోయారు.
అక్కడి నుంచి అదే రాత్రి 01:40 గంటల సమయంలో కొండాపూర్(Kondapur) మండలం మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ వద్దకు వెళ్ళి లారీ డ్రైవర్(driver) అయిన మహమ్మద్ ఆషమ్ అలియాస్ ఆసిఫ్‌ను డబ్బులు ఇవ్వమని కత్తితో బెదిరించి కొట్టి, కత్తితో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వారి నుంచి తప్పించుకునే క్రమంలో అదే లారీని నడుపుకుంటూ కొద్ది దూరం వెళ్ళాడు.
అనంతరం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అదే రోజు రుద్రారం పరిధిలో ఉన్న ప్యాలెస్ హోటల్ వద్ద 2:15 గంటల సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వద్దకు వెళ్ళి కత్తితో బెదిరించి అక్కడి లారీ డ్రైవర్ నుంచి రూ.5 వేలు, ఒకసెల్ ఫోన్ దొంగిలించుకొని పారిపోయారు. ఈ కేసులో నిందితులను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
