Singareni Coal Mystery | రికార్డుల్లో ఉన్న‌ బొగ్గు.. యార్డుల్లో లేదా !?

  • బొగ్గు గుట్టల వెనుక గుట్టు ఏంటి?
  • సింగరేణి బొగ్గు కథలో ట్విస్ట్..
  • సింగరేణి వివాదం వెనుక అసలు కథ
  • కేటీఆర్ ఆరోపణలు, ప్రభుత్వ కౌంటర్లు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వరంగ బొగ్గు సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్)లో భారీ స్థాయిలో బొగ్గు నిల్వలపై వివాదం చెలరేగింది. రికార్డుల ప్రకారం ఉన్న బొగ్గు నిల్వలు, స్టాక్‌ యార్డుల్లో కనిపిస్తున్న నిల్వల మధ్య భారీ వ్యత్యాసం ఉందంటూ ఆరోపణలు రావడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు రికార్డుల్లో ఉన్నప్పటికీ, భౌతికంగా లైవ్ స్టాక్ కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బొగ్గు విలువ దాదాపు రూ.1,600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అసలు బొగ్గు నిల్వలకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు 51:49 ఈక్విటీ వాటాలతో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ‌లో ఇలాంటి పరిస్థితి ఎలా ఏర్పడిందనే అంశంపై చర్చ జరుగుతోంది.

నేచురల్ లాసా? లేక మరో కారణమా?

అయితే ఇంత భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు ఒక్కసారిగా మాయమవడం సాధ్యమేనా? లేక రికార్డుల నిర్వహణలో లోపాలు, స్టాక్ అంచనాల్లో తేడాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి వ్యత్యాసాలకు సాధారణంగా రెండు ప్రధాన కారణాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది ‘నేచురల్ లాస్’. బొగ్గులో ఉండే తేమ (Moisture) కాలక్రమంలో ఆవిరైపోవడం, గాలికి బొగ్గు ధూళి ఎగిరిపోవడం, కొన్నిసార్లు నిల్వల్లో స్వయంగా వేడెక్కి బొగ్గు దహనమవడం వంటి కారణాల వల్ల స్టాక్‌లో కొంత మేర తగ్గుదల కనిపించడం సాధారణమే.

గనుల రంగంలో ఇలాంటి నష్టాలను ‘అసంప్షన్ లాస్’గా పరిగణిస్తారు. అదేవిధంగా కొలతలు, అంచనాల సమయంలో చిన్నచిన్న లెక్కల తేడాలు కూడా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం చర్చకు కారణమైన అంశం సాధారణ స్థాయి నష్టం కాదు. ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వల్లో వ్యత్యాసం కనిపిస్తోందన్న ఆరోపణలు రావడంతో సహజ కారణాల వల్ల మాత్రమే ఇంత పెద్ద తేడా ఏర్పడుతుందా అనే ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి. ఇంత భారీ వ్యత్యాసాన్ని కేవలం తేమ తగ్గడం, ధూళి ఎగిరిపోవడం వంటి కారణాలతో వివరించడం కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రెండో కోణం వ్యవస్థాపరమైన లోపాలకు సంబంధించింది. గనుల నుంచి బయటకు వచ్చే బొగ్గు వినియోగదారుల వద్దకు చేరే వరకు అనేక దశలను దాటుతుంది. ఇందులో కాంట్రాక్టర్లు, రవాణా సంస్థలు, స్టాక్ యార్డులు, లోడింగ్ పాయింట్లు, మధ్యవర్తి నిర్వహణ వ్యవస్థలు వంటి పలు స్థాయిలు ఉంటాయి. ఈ మొత్తం సరఫరా వ్యవస్థలో ప్రతి దశ కూడా కీలకమైందే. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే బహుళ స్థాయి పరిపాలనా వ్యవస్థ కారణంగా బాధ్యతల నిర్ధారణ (అకౌంటబిలిటీ) బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది. పర్యవేక్షణలో లోపాలు, రికార్డుల నిర్వహణలో తేడాలు లేదా వ్యవస్థలోని లొసుగులను కొందరు దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు.

అందుకే ఇప్పుడు మరో కీలక ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ భారీ వ్యత్యాసం వెనుక కేవలం లెక్కల లోపాలు, స్టాక్ అంచనాల్లో తేడాలే కారణమా లేక బొగ్గు రవాణా, నిల్వల నిర్వహణలో ఎక్కడైనా అక్రమ మళ్లింపు, లేదా ఇతర అవకతవకలు చోటుచేసుకున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందన్నది సమగ్ర విచారణ తర్వాతే స్పష్టం అవుతుంది.

టెక్ యుగంలో ఇంకా మాన్యూవ‌ల్ రికార్డ్స్ !!

అయితే, బొగ్గు నిల్వల్లో తేడాలు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దేశంలోని పలు బొగ్గు గనుల్లో స్టాక్ లెక్కలు, భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసాలు బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందన్న ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది. సమస్యలో ప్రధాన భాగం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అమలులో ఉన్న సంప్రదాయ స్టాక్ నిర్వహణ విధానాల్లోనే ఉందనే అభిప్ర‌యాలు వ్య‌క్తం అవుతున్నాయి. బొగ్గు గుట్టల ఎత్తు, వెడల్పు, పొడవు ఆధారంగా అంచనాలు వేయడం, మాన్యువల్ రికార్డులపై ఎక్కువగా ఆధారపడటం, రియల్ టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు వ్యత్యాసాలకు దారితీసే అవకాశాలు పెంచుతున్నాయి.

ప్రపంచంలోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి దేశాలు మాత్రం ఇప్పటికే డ్రోన్లు, త్రీడీ లేజర్ స్కానింగ్, శాటిలైట్ మ్యాపింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టాక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుల్లో ఒకటైన చైనా, అలాగే ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలను అమలు చేస్తున్నాయి. జీపీఎస్ ఆధారిత ట్రక్ ట్రాకింగ్, ఆర్ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, ఆటోమేటెడ్ వెయ్‌బ్రిడ్జ్‌లు, లిడార్ టెక్నాలజీతో స్టాక్ యార్డులను రియల్ టైమ్‌లో మ్యాపింగ్ చేస్తున్నారు. బొగ్గు గనిలో బయటకు వచ్చిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి టన్ను డిజిటల్‌గా ట్రాక్ అవుతోంది.

ఇండోనేషియాలో అయితే ఎగుమతి అనుమతుల నుంచి రోజువారీ ఉత్పత్తి వరకు మొత్తం వ్యవస్థను ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేశారు. ఈ సాంకేతికతల ద్వారా స్టాక్ యార్డుల్లో ఉన్న బొగ్గు పరిమాణాన్ని దాదాపు రియల్ టైమ్‌లోనే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో లెక్కల్లో తేడాలు, అక్రమ రవాణా, మళ్లింపులకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో తలెత్తిన తాజా వివాదం కేవలం 40 లక్షల టన్నుల బొగ్గు అంశానికే పరిమితం కాకుండా, సంస్థలోని స్టాక్ నిర్వహణ విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థలు, సాంకేతిక ఆధునికీకరణ అవసరంపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.

భారత్‌లో సాంకేతిక వనరుల కొరత ఉందా అంటే అస్సలు కాదు. ప్రపంచ స్థాయి అంతరిక్ష సాంకేతికత, అత్యాధునిక ఉపగ్రహ వ్యవస్థలు, భూమి ఉపరితలాన్ని అత్యంత కచ్చితత్వంతో మ్యాప్ చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది. రాత్రి వేళల్లో కూడా భూభాగంలో జరిగే మార్పులను గుర్తించగల సాంకేతిక పరిజ్ఞానం భారత అంతరిక్ష సంస్థల వద్ద అందుబాటులో ఉంది. అయినప్పటికీ బొగ్గు నిల్వలు, రవాణా, స్టాక్ నిర్వహణ వంటి కీలక అంశాల్లో ఇప్పటికీ గణనీయమైన భాగం సంప్రదాయ మాన్యువ‌ల్ డాక్యూమెంట్ పద్ధతులపైనే ఆధారపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతి ఏడాది ల‌క్ష‌ల‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి దేశ విద్యుత్ రంగానికి వెన్నెముకగా నిలిచే సింగరేణి వంటి సంస్థలో కూడా పూర్తి స్థాయి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలు అమల్లో లేకపోవడం, అనేక చోట్ల మాన్యువల్ రికార్డులపైనే ఆధారపడటం, స్టాక్ అంచనాల్లో మానవ జోక్యం ఎక్కువగా ఉండటం వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లెక్కల తేడాలు, రికార్డుల లోపాలు, పర్యవేక్షణలో పొరపాట్లు, బాధ్యతల నిర్ధారణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే బొగ్గు రంగంలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్, జీపీఎస్ ఆధారిత రవాణా పర్యవేక్షణ, డ్రోన్లతో స్టాక్ కొలతలు, రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు, స్వతంత్ర ఆడిటింగ్ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వల వివాదం నిజమా కాదా అన్నది విచారణలో తేలాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటన మాత్రం దేశంలోని బొగ్గు రంగం ఆధునికీకరణపై చర్చకు తెరలేపింది. ఎందుకంటే బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయి… ఎంత ఉన్నాయి.. ఎక్కడికి వెళ్తున్నాయి… అనే సమాచారం కాగితాలపై కాకుండా క్షణక్షణం డిజిటల్‌గా కనిపించే వ్యవస్థ ఏర్పడితేనే ఇలాంటి వివాదాలకు శాశ్వతంగా తెరపడే అవకాశం ఉంటుంది.

బొగ్గుపై రాజ‌కీయం..

మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి సహా ప‌ది మైనింగ్ ప్రాంతాల్లోని స్టాక్ యార్డుల రికార్డులు, అక్కడ ఉన్న వాస్తవ నిల్వల మధ్య తేడాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, పూర్తి స్థాయి న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆల్ పార్టీ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి లైవ్ స్టాక్ బొగ్గు నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కోరారు.

ఈ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపడంతో వ్యవహారం ఢిల్లీ దాకా చేరింది. రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన, “ఇప్పుడే ఇది కచ్చితంగా కుంభకోణమే అని చెప్పలేం. స్టాక్ లెక్కల నిర్వహణలో లోపాలు, అకౌంటింగ్ విధానాల్లో తేడాలు లేదా రికార్డుల నిర్వహణలో పొరపాట్లు కూడా కారణం అయి ఉండొచ్చు” అని వ్యాఖ్యానించారు.

అయితే సింగరేణి సంస్థ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికే ప్రధాన బాధ్యత ఉంటుందని పేర్కొన్న కిషన్ రెడ్డి, ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు. వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రావాలంటే పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం.. 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వతంత్ర దర్యాప్తు ద్వారానే అసలు నిజాలు బయటపడతాయని ఆయన వాదిస్తున్నారు.

ఈ ఆరోపణలకు ప్రతిస్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీజేపీ-బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక బీజేపీ నాయకులు మాత్రం ఈ వివాదాన్ని మరింత తీవ్రంగా ప్రస్తావిస్తున్నారు. త్వ‌ర‌లోనే అధికారంలోకి వచ్చి ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీస్తామని, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో 10ఏళ్ల పాటు జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఇతర వ్యవహారాలపై కూడా విచారణ చేపడతామని ప్రకటిస్తున్నారు.

అయితే రాజకీయ విమర్శలు, ప్రత్యారోపణలు ఎంత జరిగినా.. ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపైనే నిలిచింది. రికార్డుల్లో ఉన్నట్లు చెబుతున్న 40 లక్షల టన్నుల బొగ్గు నిజంగా ఎక్కడ ఉంది.. అది కేవలం లెక్కల నిర్వహణలో వచ్చిన వ్యత్యాసమా… లేక వ్యవస్థలో ఎక్కడైనా జరిగిన లోపాల ఫలితమా.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం అధికారిక విచారణ, సాంకేతిక పరిశీలన పూర్తైన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. అప్పటివరకు సింగరేణి బొగ్గు మిస్టరీ రాజకీయంగానూ, ప్రజల్లోనూ చర్చనీయాంశంగానే కొనసాగే అవకాశం ఉంది.