కరెంటు కోతలు అరికట్టాలి..
పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి
సిపిఎం పార్టీ నాయకులు..
విజయవాడ రూరల్(వెస్ట్), ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం పి.నైనవరం గ్రామంలో నిత్యం విద్యుత్ కోతలను అరికట్టాలని, గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. నైనవరం పాత సచివాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో నైనవరం, అంబాపురం, పాతపాడు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
గ్రామాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు, లైట్లు, టీవీలు తదితర విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల ప్రధాన రహదారులపై ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, వీధిలైట్లు అమర్చాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
ముఖ్యంగా అంబాపురం–నైనవరం గ్రామాల మధ్య ఉన్న జన్మభూమి రోడ్డును వెలుగులతో నింపాలని కోరారు. రాత్రి వేళల్లో ఈ రహదారి చీకటిమయంగా ఉండటంతో ఇళ్లకు వెళ్లేందుకు గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. జన్మభూమి రోడ్డులో అనుమతులు ఉన్నాయో, లేవో తెలియని ఓ బార్ వద్ద కొందరు తాగుబోతులు, బ్లెడ్ బ్యాచ్ ముఠా వాహనచోదకులను అడ్డగించి చీకట్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
చీకటి కారణంగా ఈ ప్రాంతంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారికి వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో పాటు బార్ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అంబాపురం–నైనవరం మధ్య జన్మభూమి రోడ్డులో నెలకొన్న చీకటి, భద్రతా సమస్యలతో పాటు విద్యుత్ కోతల సమస్యకు అధికారులు సత్వర పరిష్కారం చూపాలని సీపీఎం నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి మాతంగి ఆంజనేయులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యవర్గ సభ్యులు జి.రంగారెడ్డి, పార్టీ కార్యదర్శి సట్టు శ్రీనివాసరావు, పార్టీ సభ్యులు సురగాని బుజ్జి, ముదిగొండ కోటేశ్వరరావు, మొగడ అజయ్‌కుమార్, మాతంగి నాగమల్లేశ్వరరావు, మాతంగి బాల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
