రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం..

  • గ్రామస్తుల సమష్టి సహకారంతో కార్యక్రమానికి శ్రీకారం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గ్రామస్తులు సమష్టిగా అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. గ్రామంలో విరాళాలు సేకరించి ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అవసరమైన వంట సామగ్రిని సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధిని, ఉపసర్పంచ్ శంకర్ గౌడ్ సమకూర్చారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. భక్తులు, గ్రామస్తుల సహకారంతో ప్రతి వారం అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అందించే విరాళాలే ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాగుల మోహన్, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.