నోటీసులు లేకుండానే కూల్చివేతలా..?

కొండాపూర్ కూల్చివేతల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు,
హైడ్రాను నిలదీసిన తెలంగాణ హైకోర్టు
ప్రభుత్వ భూమిగా ఎవరు నిర్ధారించారో పూర్తి రికార్డులతో హాజరు కావాలని ఎమ్మార్వోకు ఆదేశాలు..
విచారణ ఈ నెల 11కు వాయిదా

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్ 60లో ఉన్న 350 గజాల స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడ, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడంపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కూల్చివేతలను సవాల్ చేస్తూ స్థల యజమాని పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కూల్చివేతలకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, హైడ్రా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో కూడా నోటీసులు జారీ చేసిన వివరాలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. “నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారు? నోటీసులు ఇస్తే బాధితులు కోర్టుకు వస్తారనే ఉద్దేశంతో రాత్రికిరాత్రే కూల్చేస్తున్నారా? ప్రజలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉండదా?” అంటూ రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆ స్థలం ప్రభుత్వ భూమేనని ఎలాంటి ఆధారాలతో నిర్ధారించారని న్యాయమూర్తి ప్రశ్నించగా, గతంలో పనిచేసిన ఎమ్మార్వో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తుత ఎమ్మార్వో కోర్టుకు తెలిపారు.

దీంతో, ఆ భూమిని ప్రభుత్వ స్థలంగా నిర్ధారించిన అప్పటి ఎమ్మార్వో పూర్తి రికార్డులతో కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.