సీనియర్ నేతలకు 60 శాతం నామినేటెడ్ పదవులు
హనుమకొండ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో 60 శాతం ప్రాధాన్యత కల్పిస్తూ ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్వాగతించారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేసే చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
గతంలో పార్టీ కోసం పనిచేసిన మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గాల సీనియర్ నాయకులకు పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీ తదితర నామినేటెడ్ పదవుల్లో 60 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించడం సామాజిక న్యాయానికి నిదర్శనమని అన్నారు.
ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు, స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల అభ్యర్థులు సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుని ఆశావహుల తుది జాబితా రూపొందించే విధివిధానాలు ఖరారు చేయడం స్వాగతించదగిన చర్యగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం సేవలందించిన నాయకుల త్యాగాలను గుర్తించిన ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేస్తారని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
