Indrakeeladri | జయ జయ దుర్గమ్మ..!
ఇంద్రకీలాద్రిపై భక్తి ప్రవాహం
హుండీలో రూ.3.48 కోట్ల కనకవర్షం..
318 గ్రాముల బంగారం, 3.8 కిలోల వెండి సమర్పణ
ఆషాఢ సారె ఉత్సవాల్లో మహిళల భక్తి వెల్లువ..
39 సారె బృందాలతో అమ్మవారికి ఘన సారె
35,512 మంది భక్తులకు దర్శనం..
భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులపై ఈవో, చైర్మన్ సమీక్ష
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢమాస ఆధ్యాత్మిక వైభవం పరాకాష్టకు చేరుకుంది. ఒకవైపు అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళా భక్తులు వేలాదిగా తరలివచ్చి సారెలు సమర్పిస్తుండగా, మరోవైపు భక్తులు హుండీలో సమర్పిస్తున్న కానుకలు కనకవర్షాన్ని తలపిస్తున్నాయి. గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో గత 15 రోజుల కాలానికి రూ.3,48,25,362 ఆదాయం నమోదై అమ్మవారిపై భక్తుల అపార విశ్వాసాన్ని మరోసారి చాటిచెప్పింది.

హుండీ లెక్కింపు..
జూలై 22 నుంచి ఆగస్టు 6 వరకు హుండీలో రూ.3,32,30,362 నగదు నోట్లు, రూ.15,95,000 నాణేలు లభించాయి. మొత్తం నగదు రూ.3,48,25,362గా నమోదైంది. భక్తులు 318 గ్రాముల బంగారం, 3.800 కిలోల వెండిను కానుకగా సమర్పించారు. రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.23,21,690.80గా నమోదైనట్లు దేవస్థానం వెల్లడించింది. అమెరికా డాలర్లు, యూరోలు, యూఏఈ దిర్హామ్‌లు, సింగపూర్ డాలర్లు, సౌదీ రియాల్స్, కువైట్ దినార్‌లు, ఖతార్ రియాల్స్, పౌండ్లు తదితర విదేశీ కరెన్సీలతో పాటు పాత రూ.2,000 నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పించారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, ఎస్పీఎఫ్, వన్‌టౌన్ పోలీసులు హుండీ లెక్కింపును నిర్వహించారు.

వైభవంగా ఆషాడ సారె…
ఆషాఢ సారె ఉత్సవాల 23వ రోజు ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. మొత్తం 39 సారె బృందాలకు చెందిన 16,231 మంది మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో సంప్రదాయబద్ధంగా సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ కుటుంబాల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. సారె బృందాలకు ఉచిత దర్శనం, ఆశీర్వచనం కల్పించడంతో పాటు అన్ని సౌకర్యాలను దేవస్థానం ఏర్పాటు చేసింది.
వీర మహిళల ఆధ్వర్యంలో..
ఇదే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి అత్యంత వైభవంగా ఆషాఢ సారె సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వీర మహిళలు, జనసైనికులు తాళమేళాల నడుమ సారె ఊరేగింపుగా చేరుకుని అమ్మవారికి పండ్లు, స్వీట్లు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో సారె సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

అభివృద్ధి పనుల పరిశీలన…
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కొండపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలిబాట విస్తరణ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, నూతన ప్రసాద తయారీ కేంద్రం (పోటు), అన్నప్రసాద భవన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

గురువారం వివరాలు..
గురువారం ఆలయంలో భక్తుల రద్దీ కూడా గణనీయంగా నమోదైంది. ఒక్కరోజులో 35,512 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 5,869 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. 55,178 ప్రసాద యూనిట్లు విక్రయించగా, రూ.5,67,098 విరాళాలు అందాయి. 325 మంది ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. 948 మంది కేశఖండనం చేయించుకోగా, 8,686 మంది భక్తులు నిత్య అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, భద్రత, ప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లను దేవస్థానం అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో ఇంద్రకీలాద్రి గురువారం అంతా భక్తి, సేవ, ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడింది.
