విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆరోపించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఉట్నూర్ పట్టణంలోని పులాజీబాబా కళాశాలలో శుక్రవారం ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలపై ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రితీష్ రాథోడ్ నాయకులు, విద్యార్థులతో కలిసి కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్పై బాధ్యతను మరిచిన ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి బొడ్డు కిరణ్, బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు తన్నీరు సతీష్, ప్రధాన కార్యదర్శి కాల్వ రవి, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ సీపతి లింగాగౌడ్, మాజీ ఎంపీటీసీ సాల్గేరి రవీందర్, జిల్లా నాయకులు కొమ్మురాం చందర్, సాడిగే రాజేశ్వర్, కొలిపాక రాజశేఖర్, గంట విజయ్, పులి శ్రీకాంత్, పొన్నం జగన్ పటేల్, ఉగ్గే విజయ్, కుటికెల రమేష్, సర్దార్ శ్రీనాథ్, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
