వైసీపీ యువనేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య

స్కూటీని కారుతో ఢీకొట్టి కళ్లలో కారం చల్లి దాడి
క్లూస్ టీంతో ఆధారాల సేకరణ.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

రెంటచింతల, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ నవులూరి చెన్నారెడ్డి (34) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో రెంటచింతల నుంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తుండగా రెంటచింతల–రెంటాల రహదారిపై గుర్తుతెలియని దుండగులు వెనుక నుంచి కారుతో స్కూటీని ఢీకొట్టినట్లు సమాచారం. ఆయన కిందపడిన అనంతరం దుండగులు కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని రహదారి పక్కన వదిలేసి పరారైనట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నారెడ్డి హత్య వార్తతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి మాజీ జడ్పీటీసీగా పనిచేశారు. ఈ ఘటనతో రెంటాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.