డీఎస్సీపై కూటమి ప్రభుత్వం దగా చేసిందని వైసీపీ ఆరోపణ

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు.

వాలంటీర్లకు గత ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనం అందించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. అలాగే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు.

డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో నిరుద్యోగుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply