తాడ్వాయిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కల్లులో మత్తు పదార్థం కలిపి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆల్ప్రాజోలామ్ (Alprazolam) కలిపిన 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరడ్‌పల్లి గ్రామంలోని ఓ కల్లు దుకాణంపై ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లు విక్రేత సీతూరి పోచగౌడ్ (50)ను అదుపులోకి తీసుకుని దుకాణాన్ని తనిఖీ చేయగా, విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలు లభించాయి.
ప్రాథమిక విచారణలో కల్లులో ఆల్ప్రాజోలామ్ అనే సైకోట్రోపిక్ మత్తు పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో అక్కడ కల్లు సేవిస్తున్న ఇద్దరికి నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో బెంజోడయాజెపైన్ (Benzodiazepines) పాజిటివ్‌గా తేలింది. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కూడా వారికి బీజెడ్ఓ (BZO) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దర్యాప్తును విస్తరించిన పోలీసులు కల్లు దుకాణం లైసెన్స్ హోల్డర్ కొండాపురం స్వామిగౌడ్ (36)ను అదుపులోకి తీసుకుని విచారించగా, అక్రమ లాభాల కోసం కల్లులో మత్తు మందు కలిపి విక్రయించినట్లు అంగీకరించినట్లు తెలిపారు.
ఈ కేసులో 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాలు కలిపిన ఆహార పదార్థాలు లేదా పానీయాల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై మరింత కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
