విజయ డెయిరీలో అన్ని ఏకగ్రీవమే
- మళ్లీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఎన్నిక
- మూడు డైరెక్టర్ స్థానాలకు ముగ్గురు ఎన్నిక
- వరుసగా మూడోసారి చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) పాలకవర్గంలో ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ స్థానాల భర్తీ ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసింది. నామినేషన్ల పరిశీలనలో ముగ్గురు అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, మరో అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మిగిలిన ముగ్గురు పోటీ లేకుండానే డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పాలకవర్గ సమావేశంలో చలసాని ఆంజనేయులు వరుసగా మూడోసారి విజయ డెయిరీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ప్రశాంతంగా ఎన్నికలు..
విజయ డెయిరీ ఆవరణలోని క్షీరదర్శన్ హాలులో ఎన్నికల అధికారి, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (విరమణ) ఎల్. గురునాథం ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన జరిగింది. మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్ర నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
మూల్పూరు రామ్మోహన్, మర్రెడ్డి బసివిరెడ్డి, పాలడుగు వసంతకుమార్ నామినేషన్లు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాల ఉత్పత్తిదారుల సంఘాలకు లేదా సభ్యులకు విజయ డెయిరీకి బకాయిలు ఉండటంతో నిబంధనల ప్రకారం తిరస్కరించబడ్డాయి.అనంతరం చలసాని చక్రపాణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బరిలో మిగిలిన చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, గొంది నరేంద్ర పోటీ లేకుండానే డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల నిర్వహణ అవసరం లేకుండానే ప్రక్రియ ముగిసింది.
పటిష్ట బందోబస్తు..
ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొత్తపేట సీఐ చినకొండలరావు ఆధ్వర్యంలో 30 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థులు, ప్రతిపాదకులు, మద్దతుదారులకు మాత్రమే డెయిరీ ఆవరణలో ప్రవేశం కల్పించారు.
ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నిక..
డైరెక్టర్ల ఎన్నిక పూర్తికావడంతో అనంతరం జరిగిన పాలకవర్గ సమావేశంలో చలసాని ఆంజనేయులు మరోసారి ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ఆయన చైర్మన్ పదవిని చేపట్టడం విజయ డెయిరీ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలిచింది. జిల్లా సహకార, పాల ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.
