రోగుల ప్రాణాలను కాపాడే యోధులు… నర్సులు

రోగుల ప్రాణాలను కాపాడే యోధులు… నర్సులు
సేవలో మానవత్వం… నర్సింగ్ వృత్తి గొప్పతనం
సంతృప్తికర వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
వనరుల సద్వినియోగంతో ప్రైవేటుగా దీటుగా జీజీహెచ్ సేవలు
త్వరలో అన్ని సమస్యలకూ పరిష్కారం
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, ఆంధ్రప్రభ : రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని.. వైద్యులతో సమానంగా నర్సులు కూడా అహర్నిశలు కష్టపడుతూ రోగులకు ధైర్యం, భరోసా కల్పిస్తూ చక్కని చిరునవ్వుతో ఆత్మీయతతో రోగాన్ని దూరం చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలోని న్యూ జీజీహెచ్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ జి.అక్కమ్మ రూ. 50 వేలు అందించగా.. మరో లక్షా యాభైవేలు నర్సింగ్ అసోసియేషన్ ద్వారా సమకూర్చి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూనే జీజీహెచ్ ద్వారా అందించే వైద్య సేవల్లో 80 శాతానికి పైగా సంతృప్తి స్థాయి నమోదుకావడంలో నర్సుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆసుపత్రితో పాటు నర్సింగ్ కళాశాల, వసతి గృహానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే ఇవి పరిష్కారమవుతాయన్నారు.
ఆసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించి రోగుల మన్ననలు పొందుతోందని.. ప్రభుత్వ చొరవతో పాటు సీఎస్ఆర్, దాతల సహకారంతోనూ ఆసుపత్రి అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు చిరస్మరణీయమని, ఆమె చూపిన సేవా మార్గం నేటికీ నర్సింగ్ వృత్తికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మరింత మానవీయ దృక్పథంతో, ఆప్యాయతతో రోగులకు సేవలందించినప్పుడే ఆమెకు నిజమైన నివాళులు అర్పించినవారమవుతామని తెలిపారు.
రాత్రీపగలు రోగుల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ రోగాన్ని నయం చేసి ఇళ్లకు క్షేమంగా పంపిస్తూ నర్సులు ఆదరాభిమానాలు పొందుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనలో వైద్య సేవల్లో నాణ్యత అత్యంత ముఖ్యమని.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు, ఆరోగ్య ఆంధ్ర సాధనకు విశేష కృషిచేస్తోందని పేర్కొన్నారు. ఏ ఆసుపత్రిలో లేనివిధంగా ఇక్కడ ఓపీ ఉంటోందని.. ఇక్కడ అందుతున్న నాణ్యమైన సేవలకు ఇది నిదర్శనమన్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో 95 శాతానికిపైగా సంతృప్తి స్థాయి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
అన్ని విభాగాలూ అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసినప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితులు, క్లిష్ట సమయాల్లో నర్సులు చూపించే అంకితభావం, సహనం, సేవా దృక్పథం సమాజానికి ఆదర్శమని తెలిపారు. రోగులు త్వరగా కోలుకోవడంలో నర్సుల సంరక్షణ, మానసిక ధైర్యం ఎంతో ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని.. రోగుల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులతో సమానంగా నర్సులు కూడా అహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తున్నారని కొనియాడారు.
సేవాభావం, సహనం, మానవత్వంతో నిండిన నర్సింగ్ వృత్తి సమాజానికి ఆదర్శప్రాయమని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన నర్సుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదని తెలిపారు. నర్సింగ్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు విద్యాసాగర్ వెల్లడించారు.
విశేష సేవలకు ఆత్మీయ సత్కారం..
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 35 మందిని గౌరవ అతిథులు సత్కరించారు. విధి నిర్వహణలో వీరు అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎ.ఏడుకొండలరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కృష్ణారావు, జిల్లా నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు క్షమాబేగం, కోశాధికారి కె.శివలీల, ఏపీ ఎన్‌జీజీవో జిల్లా అధ్యక్షకార్యదర్శులు డీఎస్ఎన్ రెడ్డి, పి.రమేష్, నగరశాఖ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
