ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

  • అలపర్తి విద్యాసాగర్
  • సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో సమస్యలపై చర్చిస్తాం..
  • వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచే అంశంపై సానుకూల నిర్ణయానికి ప్రయత్నం

విజయవాడ, ఆంధ్రప్రభ: గవర్నమెంట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తానని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ తెలిపారు.

ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో నిర్వహించారు. సమావేశం అనంతరం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన అనంతరం అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలన్న డిమాండ్‌తో పాటు ఉద్యోగుల ప్రధాన సమస్యలన్నింటినీ ఇటీవల జరిగిన మంత్రుల బృందం సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.

త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల డిమాండ్లపై జరిగే సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించి, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు.

అలాగే, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలే ధ్యేయంగా ఏపీ జేఏసీ పనిచేస్తోందని, ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో పీఆర్సీ చైర్మన్ నియామకం, ఐఆర్ మంజూరు, డీఏ బకాయిల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణకు జేఏసీ నాయకత్వం సిద్ధంగా ఉంటుందని విద్యాసాగర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాణ్యం వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగభూషణం, రత్నం, వెంకటేశ్వరరావు, సంతోష్, హైమావతి, కళ్యాణి, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.