రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా
పెండింగ్ కేసుల దర్యాప్తు నాణ్యతగా పూర్తి చేయాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై పటిష్టమైన నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్‌ను ఆదేశించారు.
గురువారం బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి, పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించారు. కేసుల దర్యాప్తు నాణ్యతతో సాగి, త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏసీపీ కార్యాలయ రికార్డులను పరిశీలించిన సీపీ, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద నమోదైన కేసుల స్థితిగతులను తెలుసుకున్నారు. పెండింగ్‌కు గల కారణాలపై ఏసీపీని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజల్లో పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సివిల్ భూ వివాదాల్లో పోలీసులు అనవసర జోక్యం చేసుకోకుండా చట్టపరమైన విధానాల ప్రకారమే వ్యవహరించాలని, రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఏసీపీ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించగా, ఏసీపీ, డీసీపీలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
