AP | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్నూలులో ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు
మూడు విలాసవంతమైన భవనాలు, ఐదు ఖాళీ స్థలాల గుర్తింపు
బ్యాంకు లాకర్లు, బంగారం, వెండి లెక్కింపు కొనసాగింపు
AP | కర్నూలు రూరల్ బ్యూరో, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద నివాసం ఉంటున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గోపాల్రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. గోపాల్రావుకు సంబంధించిన కర్నూలు జిల్లాలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఏసీబీ కర్నూలు ఇన్చార్జి డీఎస్పీ సీతా రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. పెద్దపాడు సమీపంలోని మైత్రి హోంలోని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఇతర ప్రదేశాల్లోనూ అధికారులు పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.
మూడు భవనాలు.. ఐదు ఖాళీ స్థలాలు…
సోదాల్లో ఇప్పటివరకు కర్నూలు నగర పరిధిలో మూడు విలాసవంతమైన భవనాలు, ఐదు ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించారు. వీటి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.2.80 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం ఆస్తుల విలువపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
లాకర్లు, బంగారం, వెండి పరిశీలన…
గోపాల్రావుకు సంబంధించిన బ్యాంకు లాకర్లు, బంగారం, వెండి ఆభరణాలు, నగదు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. వీటి లెక్కింపు ఇంకా కొనసాగుతోందని, స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తులు, నగదు, ఆభరణాలపై పూర్తి వివరాలను సోదాలు ముగిసిన అనంతరం అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.
ఖరీదైన హోం థియేటర్ గుర్తింపు…
సోదాల సందర్భంగా గోపాల్రావు నివాసంలో అత్యంత ఖరీదైన హోం థియేటర్ వ్యవస్థను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంటిలోని విలువైన గృహోపకరణాలు, ఇతర ఆస్తుల వివరాలను కూడా నమోదు చేస్తున్నట్లు సమాచారం.
దర్యాప్తు కొనసాగింపు…
సోదాల్లో లభించిన స్థిరాస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ఈ సోదాలు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
