నకిలీ రూ.500 నోట్ల ముఠా గుట్టురట్టు

రూ.68 వేల విలువైన నకిలీ నోట్లు, పరికరాలు స్వాధీనం

బిజినేపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో నకిలీ రూ.500 నోట్ల తయారీ ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. పక్కా సమాచారంతో సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ.68 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లు, ఏడు సెల్‌ఫోన్లు, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు.

గురువారం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 1న మంగనూరు గ్రామంలోని దుర్గా వైన్స్‌లో ఇద్దరు వ్యక్తులు రూ.500 నోట్లతో బీర్లు కొనుగోలు చేశారు. నోట్లపై అనుమానం వచ్చిన వైన్స్ యజమాని రాగి స్వామి పరిశీలించగా అవి నకిలీవని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

విచారణలో పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాపురం గ్రామానికి చెందిన నాగరాజు ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న నాగరాజు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కలవపూడి గ్రామానికి చెందిన శివ వెంకట ధర్మరాజు, సిద్ధాపురానికి చెందిన అశోక్‌కుమార్, ఏలూరు జిల్లా తడికలపూడికి చెందిన సతీష్‌కుమార్, మంగనూరుకు చెందిన వంగ నవీన్‌గౌడ్ తదితరులతో కలిసి ముఠా ఏర్పాటు చేసి నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నట్లు వివరించారు.

ముఠా గుట్టుచప్పుడు కాకుండా సుమారు రూ.2 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు ముద్రించినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఈ నకిలీ నోట్లను కురుమూర్తి ప్రాంతంలోని రద్దీ ప్రదేశాలు, పెట్రోల్ బంకులు, వైన్స్ దుకాణాలు తదితర ప్రాంతాల్లో చలామణి చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్లు చెప్పారు.

దర్యాప్తులో భాగంగా నవీన్‌గౌడ్, శివ వెంకట ధర్మరాజుతో ఒప్పందం కుదుర్చుకుని అసలు రూ.1,000కు రూ.4,000 విలువైన నకిలీ కరెన్సీ తీసుకునే విధంగా వ్యవహరించినట్లు వెల్లడించారు. భీమవరం వెళ్లి రూ.20 వేల అసలు నగదు ఇచ్చి రూ.80 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కురుమూర్తికి రూ.10 వేల విలువైన నకిలీ నోట్లు ఇవ్వడంతో అవి చలామణిలోకి వచ్చి వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. మరో నిందితుడు సత్యనారాయణకు కూడా రూ.70 వేల విలువైన నకిలీ నోట్లు అందించినట్లు గుర్తించినట్లు చెప్పారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన జయమంగళ సత్యనారాయణ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

  • రూ.68 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లు
  • 7 సెల్‌ఫోన్లు
  • హెచ్‌పీ కలర్ ప్రింటర్/జిరాక్స్ యంత్రం
  • కౌంటింగ్ మెషీన్
  • జనరల్ కాటన్ లైన్ పేపర్లు
  • నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించిన ఇతర సామగ్రి