అచ్చంపేట తాలూకా టిడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షుడిగా బింపాకుల జంగయ్య
ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ఏకగ్రీవ నియామకం..
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యమన్న నూతన అధ్యక్షుడు
అమ్రాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) అచ్చంపేట తాలూకా అధ్యక్షుడిగా ఉప్పునుంతల మండలానికి చెందిన మెట్రో ఈవినింగ్ రిపోర్టర్ బింపాకుల జంగయ్య ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ చింకరహోల్ అటవీ ప్రాంతంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ, జిల్లా నాయకుల సమక్షంలో బింపాకుల జంగయ్యకు నియామక పత్రం అందజేసి సన్మానించారు. అనంతరం అచ్చంపేట తాలూకా నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా సయ్యద్ షికిల్, శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. ఆంజనేయులు, కోశాధికారితో పాటు సలహాదారులను నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం నూతన కమిటీ సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన అధ్యక్షుడు బింపాకుల జంగయ్య మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తాలూకా పరిధిలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. జర్నలిస్టులందరినీ ఐక్యంగా తీసుకెళ్లి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చక్కర రామచంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, ప్రధాన కార్యదర్శి సయ్యద్ షఫి, నాయకులు చారగొండ వెంకటేష్, కోశాధికారి బాదం పరమేష్, నవీన్‌తో పాటు ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.
