తిరువూరు సమగ్రాభివృద్ధికి సహకరించండి

  • ప్రత్యేక నిధులు కేటాయించాలి
  • సీఎం చంద్రబాబుకు కొలికపూడి వినతిపత్రం

అమరావతి, ఆంధ్రప్రభ: తిరువూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని కోరుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వివరించారు.

ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, కల్వర్టులు, వంతెనల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తిరువూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కోరారు.

ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.