ఫార్మాసిటీలో అగ్నిప్రమాద ఘటనపై అధికారుల ఆరా..

ఫార్మాసిటీలో అగ్నిప్రమాద ఘటనపై అధికారుల ఆరా..

ఇద్దరు కార్మికులు సజీవదహనం
మరో ఇద్దరు గల్లంతైనట్లు సమాచారం

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో ఆందోళన నెలకొంది.

మృతులను చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనాస్థలిని జిల్లా జాయింట్ కలెక్టర్ సూర్యమాన్ పటేల్, పరవాడ ఇన్‌చార్జి డీఎస్పీ మోహనరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఇదిలా ఉండగా, పరిశ్రమలో భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీఐటీయూ జిల్లా నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.