దుర్గమ్మకు జనసేన వీర మహిళల ఆషాఢ సారె
- భక్తిశ్రద్ధలతో సారె సమర్పణ
- ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చిన వీర మహిళలు
- తాళమేళాల మధ్య సారె ఊరేగింపు
- జనసేన సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామని నాయకుల వెల్లడి
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢమాస సారెను గురువారం భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో వీర మహిళలు, జనసైనికులు పాల్గొని ఆధ్యాత్మిక భక్తి వైభవాన్ని చాటారు.
తాళమేళాల నడుమ సంప్రదాయబద్ధంగా సారె ఊరేగింపును నిర్వహించిన వీర మహిళలు పండ్లు, స్వీట్లు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా–పెన్నా రీజియన్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి, పార్టీ పీఏసీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ, పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా చేర్చడం వీర మహిళల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తి, సేవా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల గాంధీ, వీర మహిళలు చింతల లక్ష్మి, నగర సంయుక్త కార్యదర్శి సోడిశెట్టి రాధాకృష్ణ, పార్టీ నాయకులు పెటేటి నాంచారయ్య, భవాని, మేకల స్వాతి, శైలజ, చెరుకుమల్లి రాధికతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

