NTR | చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఆణిముత్యాలు!”

NTR | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : రాజకీయాల్లోకి రావడం సులభం, కానీ ప్రజా హృదయాల్లో నిలిచిపోవడం చాలా కష్టం. ఒక మహానాయకుడు, విజనరీ అయిన నందమూరి తారక రామారావు తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. వాటిలో అత్యంత విలువైన వాటిని, తన అల్లుడు చంద్రబాబు నాయుడుకి పలు సందర్బాల్లో ఆయన మాటాల్లో తెలిపారు. రాజకీయాల్లో ఒక నాయకుడు ఎలా ఉండాలి? ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అప్పట్లో పెద్దాయన చంద్రబాబుతో పంచుకున్న ఆ ‘రాజకీయ సూత్రాలు’ ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ఒక పాఠంలా వినిపిస్తుంటాయి. ఆ ఆణిముత్యాల్లాంటి మాటలు ఏమిటో తెలుసా.
ప్రజలే అసలైన బలం…
“బాబు… ప్రజల మధ్యే ఉండాలి. ప్రజలే అసలైన బలం.”
పెద్దాయన చెప్పిన ఈ మాట చంద్రబాబుకి రాజకీయ ప్రయాణంలో నిరంతరం స్ఫూర్తినిచ్చింది. ప్రజల నాడిని పట్టుకోవడమే నాయకుడికి అసలైన విజయమని ఆయన నమ్మేవారు. ప్రజల పక్షాన ఉంటూ, వారిని తన అసలైన బలంగా భావిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.
విశ్వాసమే పునాది..
“పార్టీని కాపాడటం అంటే ప్రజల విశ్వాసాన్ని కాపాడటం.”
పార్టీ అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు, అది ప్రజల ఆశయాలకు ప్రతిబింబమని, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలని ఎన్టీఆర్ చంద్రబాబుకు దిశానిర్దేశం చేశారు. ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ, ప్రజల విశ్వాసాన్నే పునాదిగా మార్చుకుని నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
నాయకత్వ లక్షణాలు
క్రమశిక్షణ, సమయపాలన, పనిపై నిబద్ధత – ఈ మూడు అంశాలను ఎన్టీఆర్ చంద్రబాబుకు ఎప్పుడూ నూరిపోసేవారు. వీటిని తనదైన శైలిలో చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సమర్థవంతంగా అమలు చేశారు.
కష్టమే గెలుపునకు మార్గం..
“కష్టపడితేనే నాయకత్వం నిలుస్తుంది బాబు.”
రాజకీయాల్లో నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే అలుపెరగని శ్రమ తప్పనిసరి అని ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు, చంద్రబాబు దినచర్యలో భాగమయ్యాయి. ఏడు పదుల వయసులోనూ అలుపెరగని నాయకుడిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు.
ఒక మార్గదర్శిగా ఎన్టీఆర్ ఇచ్చిన ఈ పాఠాలు, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో ఎంతో కీలకపాత్ర పోషించాయి. నేటి తరానికి కూడా రాజకీయాల్లో ఎలా ఉండాలో నేర్పే గొప్ప పాఠాలు ఇవి.
