వారం రోజులుగా భగీరథ నీటి సరఫరా నిలిచివేత

రెండు మండలాల్లో తాగునీటి సంక్షోభం..

లీకేజీల మరమ్మతులకు గ్రామస్థుల డిమాండ్

నల్లబెల్లి, ఆంధ్రప్రభ: ఖానాపూర్–మహబూబాబాద్ ప్రధాన మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీల కారణంగా గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నల్లబెల్లి, దుగ్గొండి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంలో భాగంగా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామంలో 1,200 కిలోలీటర్ల సామర్థ్యంతో సంప్ ఏర్పాటు చేశారు. ఈ పంపింగ్ స్టేషన్ నుంచి రాంనగర్ నీటి ట్యాంక్ ద్వారా దుగ్గొండి, నల్లబెల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది.

అయితే ఖానాపూర్–మహబూబాబాద్ ప్రధాన పైప్‌లైన్ రెండు, మూడు చోట్ల భారీగా లీకేజీలు ఏర్పడటంతో నారక్కపేట–రాంనగర్ మధ్యంతర పంపింగ్ స్టేషన్‌కు నీరు చేరడం నిలిచిపోయింది. దీంతో రెండు మండలాల్లోని గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాగునీటి కోసం ప్రత్యామ్నాయ వనరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు మిషన్ భగీరథ డీఈ, ఏఈ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్థులు విమర్శించారు.

ఖానాపూర్–మహబూబాబాద్ ప్రధాన పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి నారక్కపేట–రాంనగర్ పంపింగ్ స్టేషన్‌కు నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామాల ప్రజలు ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.