లక్ష్మీపురం మార్కెట్లో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్ఠం చేయాలి
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని మార్కెట్లలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంకతో కలిసి లక్ష్మీపురం మార్కెట్‌ను సందర్శించిన ఆయన పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మార్కెట్లో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో తరలించాలని సూచించారు. రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలింపులో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో చెత్తను ముందుగా బాలసముద్రం ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి శాస్త్రీయ విధానంలో డంపింగ్ యార్డుకు తరలించేలా కార్యాచరణ రూపొందించాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. మార్కెట్ పరిసరాల్లో అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా ప్రతిరోజూ శుభ్రత పనులు నిర్వహించడంతో పాటు దోమల నివారణ కోసం క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టాలని సూచించారు.
జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రధాన మురుగు కాలువలు, డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేస్తూ వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్–నాన్‌వెజ్ మార్కెట్‌ను పరిశీలించి, వ్యాపారులు, వినియోగదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో సీఎంహెచ్వో, ఇన్చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీహెచ్‌వో లక్ష్మారెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ రాజేష్‌బాబు, సంబంధిత అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
