20 ఇండస్ట్రియల్ నోడ్లకు గ్రీన్ సిగ్నల్
- ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్న కు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం
- గత ఐదేళ్లలో 12 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
- నాలుగు పారిశ్రామిక టౌన్‌షిప్‌లు పూర్తి
- జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి రూ.16,172.95 కోట్లు..
- ప్రాజెక్టులకు అదనంగా రూ.14,569.97 కోట్లు విడుదల
- రోడ్లు, నీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థలతో సమగ్ర పారిశ్రామిక నగరాల నిర్మాణం
- ప్రగతి, పీఎంజీ పోర్టళ్ల ద్వారా ప్రాజెక్టుల వేగవంతం
- సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం ప్రత్యేక పర్యవేక్షణ
విజయవాడ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్ఐసీడీపీ) కింద పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గత ఐదేళ్లలో ఆమోదించిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, అమలు పురోగతిపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ సమగ్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక ప్రయోజన వాహనాల (ఎస్పీవీలు) ద్వారా పారిశ్రామిక టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సమకూర్చగా, కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ, రుణాల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తోంది. ప్రాజెక్టుల ఆమోదానికి ముందు మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళిక, పర్యావరణ అనుమతులు, వివరణాత్మక డిజైన్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎన్ఐసీడీపీ కింద మొత్తం 20 పారిశ్రామిక నోడ్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని, వీటిలో గత ఐదేళ్లలో 12 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు వెల్లడించారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం డీపీఐఐటీ ద్వారా ఎన్ఐసీడీఐటీకి రూ.16,172.95 కోట్లు విడుదల చేయగా, వివిధ ప్రాజెక్టుల అమలుకు ఎస్పీవీలకు అదనంగా రూ.14,569.97 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆమోదం పొందిన 20 ప్రాజెక్టుల్లో నాలుగు పారిశ్రామిక టౌన్‌షిప్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి.
గుజరాత్లో ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, మహారాష్ట్రలో షేంద్రా–బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియా, ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్ నోయిడా ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్, మధ్యప్రదేశ్‌లో విక్రమ్ ఉద్యోగపురి ప్రాజెక్టుల్లో రోడ్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, పరిపాలనా భవనాలు, ఐసీటీ సౌకర్యాల అభివృద్ధి పూర్తయినట్లు మంత్రి తెలిపారు.
ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, సకాలంలో పూర్తి చేసేందుకు ప్రగతి మరియు పీఎంజీ పోర్టళ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. డీపీఐఐటీ, ఎన్ఐసీడీఐటీ, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి, అడ్డంకులను తొలగిస్తూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
