- తొలి రౌండ్‌లోనే ప్రణయ్, లక్ష్యసేన్ ఔట్
- మాళవిక, అణుపమ కూడా ఇంటికి
భారత సింగిల్స్ స్టార్ షట్లర్ పీవీ సింధు, డబుల్స్ స్టార్లు సాత్విక్-చిరాగ్ జోడీ ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు.
గాయాలతో చాలా కాలం బ్యాడ్మింటన్‌కు దూరమైన సాత్విక్-చిరాగ్‌లు గత వారం జరిగిన సింగపూర్ ఓపెన్‌లో పునరాగమనం చేసి మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సెమీస్ వరకు చేరి మంచి ఫామ్‌ను కనబర్చారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా ఓపెన్‌లోనూ అదిరే ఆరంభాన్ని అందుకున్నారు.
మంగళవారం జకార్త వేదికగా జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో మాజీ వరల్డ్ నం.1 సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 18-21, 21-18, 21-14 తేడాతో స్థానిక షట్లర్లు లియో రోలీ-బాగాస్ మౌలానా (ఇండోనేషియా) జంటను ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు 22-20, 21-23, 21-15 తేడాతో జపాన్ స్టార్ నొజొమి ఒకుహారాపై అద్భుతంగా పోరాడి గెలిచింది.
ఇతర మ్యాచ్‌ల్లో అణుపమ ఉపాద్యాయ 15-21, 9-21 తేడాతో కిమ్ గా యియున్ (దక్షిణ కొరియా) షట్లర్ చేతిలో వరుస గేముల్లో ఓడగా.. రక్షిత శ్రీ సంతోష్ రామ్‌రాజ్ 21-14, 15-21, 12-21తో 8వ సీడ్ సుపనిదా కాటెథోగ్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. మరోవైపు మాళవిక బన్సోద్ గాయంతో ఆట మధ్యలోనే వైదొలిగింది.
పోరాడి ఓడిన సేన్..
పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌ను కూడా దాటలేక పోయారు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో 11-21, 22-20, 15-21 తేడాతో టాప్ సీడ్ షీ యు ఖీ (చైనా)పై సుమారు ఒక గంట 5 నిమిషాల పాటు పోరాడి ఓడాడు. మరో మ్యాచ్‌లో సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 17-21, 18-21 తేడాతో ఇండోనేషియా షట్లర్ ఆల్వి ఫర్హాన్ చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.